మృగశిర కార్తె సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మత్స్యకారులు కొర్రమీను చేపలను అందజేశారు. రాష్ట్రంలో మత్స్యకారులు చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 

తెలంగాణలో మత్స్య సంపద బాగా పెరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. మృగశిర కార్తె (mrigasira karthi) సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్‌‌కు చెందిన మత్స్యకారులు తలసానికి కొరమీను చేపలను (korrameenu) అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 

ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలతో మత్స్యకారుల ఆదాయం ఎంతో పెరిగిందని తెలిపారు. అందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. తమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున మత్స్యశాఖ మంత్రికి కొరమీను చేపలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇకపోతే.. వర్షాకాలం మొదలవ్వనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ (hyderabad) నగరంలోని ముంపు ప్రాంతాల వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) స్పందించారు. గతంతో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌లో ముంపు ప్రభావం తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మీలతో కలిసి పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపైనే పట్టణ ప్రగతిలో ఎక్కువగా దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. 

మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు అందుకున్న తర్వాత హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా వున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరికిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.