ఖమ్మంలో వింత చేపల వర్షం.. ఆసక్తిగా గమనిస్తున్న స్థానికులు..
ఖమ్మం జిల్లా వైరాలో చేపల వర్షం కురిసింది. అయితే, ఈ చేపలు వింతగా ఉండడంతో స్థానికులు అవేం చేపలో అని ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఖమ్మం : ఖమ్మంలో చేపల వర్షం కురిసింది. దీంతో స్థానిక ప్రజలు ఈ వింతను చూడడానికి వర్షంలో ఎగబడ్డారు. చేపల్ని పట్టుకున్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత బజార్, శాంతినగర్ శివాలయం రోడ్డు, పినపాకల్లో శుక్రవారం చేపల వర్షం కురిసింది. అయితే, భారీ వర్షానికి రోడ్లు, డ్రైనేజీలు పొంగి పొర్లడంతో రిజర్వాయర్ నుంచి చేపలు ఎదురెక్కి ఉండవచ్చని.. దీనివల్లే వర్షంలా కురిసి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. వర్షాలకు చేపలు పడడం అక్కడక్కడా గమనిస్తూ ఉంటాం. ఈ వార్తలు వింటూనే ఉంటాం. అయితే ఈ సారి కురిసిన చేపలు ఎప్పుడూ చూస్తే చేపల్లా కాకుండా విచిత్రంగా ఉన్నాయని.. స్థానికులు చెబుతున్నారు. వీటిని ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా.. విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పెంకుటిల్లు గోడకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పెంకుటిల్లు గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఐదుగురు నిద్రిస్తుండగా వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మణుగూరు ఏరియా బొగ్గు గనుల్లో భారీగా వరద నీరు చేరింది. ఈ కారణంగా 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోని వర్షపు నీటిని 17 భారీ మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. మరోవైపు నిల్వ ఉన్న బొగ్గు దెబ్బతినకుండా రవాణా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, ఏపీలో గోడకూలి ఇద్దరు మృతి...
కాగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్లో నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా- కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలియజేసింది. మరోవైపు రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. వీటన్నింటి ప్రభావంతో జమ్మూ కాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని పలు చెరువులు అలుగు పారుతున్నాయి. నవిపేట్ మండలం జనపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద ఎత్తున అలుగు పారలేదని స్థానికులు చెబుతున్నారు. మండలంలోని లింగాపూర్ శివారులో వరద ఉధృతికి తుంగిని మాటు కాలువకు పలుచోట్ల గండి పడి నీరు పొలాల్లోకి చేరి సుమారు 100 ఎకరాల పంట నీట మునిగింది.