హైదరాబాద్: ఓ చేపల వ్యాపారిని హైదరాబాదులో దారుణంగా హత్య చేశారు. రమేష్ అనే చేపల వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఓ మహిళ ఫోన్ కాల్ రావడంతో బయటకు వచ్చిన రమేష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

జవహర్ నగర్ లోని ఓ ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా గోనెసంచీలో శవం కనిపించింది. ఈ నెల 1వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .

బోరబండలోని రామారావునగర్ లో నివాసం ఉంటున్న రమేష్ ను ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆ ఫిర్యాదులో చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

మంగళవారం సాయంత్రం ఓ ఇంట్లో అతని శవాన్ని గుర్తించి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన రమేష్ ను కిడ్నాప్ చేసిన దుండగులు మర్నాడే అతన్ని హత్యచేసి గోనెసంచీలో చుట్టి పడేసినట్లు అనుమానిస్తున్నారు. రమేష్ విడుదలకు రూ.90 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. ఫోన్ ఎక్కడి నుంచి చేశారో కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు రమేష్ మొబైల్ ఫోన్ కు వచ్చిన నెంబర్లను పరిశీలిస్తున్నారు. 

ఇదిలావుంటే, శ్రీనివాస్ అనే వ్యక్తిని ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం ఇద్దరు పిల్లలు, మహిళతో జవహర్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు చెబుతున్నారు.