చేపల లోడుతో వెడుతున్న ఓ లారీ ప్రమాదానికి గురైంది. రోడ్డు మొత్తం చేపలతో నిండిపోయింది. దీంతో జనం ఎగబడ్డారు. అరగంటలో లోడును ఖాళీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలోని
Bhadradri Kottagudem District బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద Fish lorry బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బోల్తా పడిన లారీ వద్ద చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వారించినా.. వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. 2 కేజీల బరువుండే సుమారు 4వేల చేపలు ఉన్న లారీ లోడ్ ను అరగంటలో ఖాళీ చేశారు. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెల్తుండగా లారీ ప్రమాదానికి గురైంది.
రేపు మృగశిరకార్తె కూడా కావడంతో స్థానికులు చేపలను పట్టుకునేందుకు ఎగబడ్డారు. ఒకరిమీద ఒకరు పడి తోసుకుంటూ మరీ చేపల్ని పట్టుకెళ్లారు. ఓ దిక్కు లారీని లేపేందుకు కొంతమంది ప్రయత్నిస్తుండగా.. చేపలు దొరికిన వాళ్లు సంతోషంగా వాటిని సంచుల్లో వేసుకుని బయల దేరారు. లారీలో చేపల ఆనవాళ్లు కూడా లేకుండా ఖాళీ చేశారు.
ఇలాంటి ఘటనే ఏప్రిల్ 20న హైదరాబాద్ లో జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్ సమీపంలో ఓఆర్ఆర్పై ఘట్కేసర్ మార్గంలో ఏప్రిల్ 19 రాత్రి ఏడున్నర గంటలకు థమ్స్ అప్ లోడ్ తో వెళ్తున్న లారీ టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ పై పడిపోయింది. దీంతో లారీలోని థమ్స్అప్ కూల్ డ్రింక్ సీసాలు రహదారికి ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అయితే ఇది గమనించిన వాహనదారులు గాయపడిన డ్రైవర్, క్లీనర్ లను పట్టించుకోకుండా.. తమ వాహనాలను రోడ్డుపైన నిలిపి అందినకాడికి కూల్ డ్రింక్ సీసాలను తీసుకెళ్లారు. దీంతో నిమిషాల్లోనే లారీలోని మొత్తం సరుకు ఖాళీ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
ఇక, ఈ జనవరిలో ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని విదిశాలో అమానవీయ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని విదిషా నుంచి హైదరాబాద్ కు మేకలను తీసుకెళ్తున్న ట్రక్ మార్గమధ్యంలో ఒవర్ టర్న్ అయ్యింది. డ్రైవర్ అందులో చిక్కుకుపోయాడు. ఈ విషయం తెలిసిన సమీపంలోని గ్రామస్తులు వాటిని పట్టుకు పోయేందుకు పోటీపడ్డారు. కానీ లారీ కింద చిక్కుకుపోయిన వ్యక్తిని మాత్రం ఎవరూ కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్లోని సిరోంజ్ జిల్లా, కంకర్ ఖేడి లోయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివపురి నుంచి సుమారు వంద మేకలతో బయలుదేరిన లారీ.. రాత్రి 8 గంటల సమయంలో కంకర్ ఖేడి వద్ద అదుపుతప్పి.. లోయలో పడిపోయింది. ఇది గమనించిన సమీపంలోని గ్రామస్తులు... ఘటనా స్థలానికి పరుగు పరుగున చేరుకున్నారు. అక్కడున్న మేకలను పట్టుకు పోయేందుకు పోటీపడ్డారు. లారీలోని మేకలను అందిన కాడికి దోచుకున్నారు. టూవీలర్ల మీద ఇద్దరిద్దరుగా వచ్చి.. మధ్యలో మేకలను వేసుకుని పట్టుకుపోయారు.
విషయం తెలిసి అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారించినా వినలేదు. ట్రక్కులోకి ఎక్కిమరీ మేకల్ని తీసుకోసాగారు. దీంతో పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జి చేశారు. అయితే మేకల మీద పెట్టిన శ్రద్ధ ట్రక్కు డ్రైవర్ విషయంలో చూపించలేదు. ట్రక్కు కింద చిక్కుకుపోయిన సచిన్ కాటిక్ అనే వ్యక్తిని మాత్రం ఎవరూ సకాలంలో కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
