తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్వతగిరీలోని వార్డు నెంబర్ 8లో దయాకర్‌రావు దంపతులు ఓటు వేశారు. 

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో టీఆర్ఎస్ అభ్యర్ధి క్రాంతికుమార్‌పై కాంగ్రెస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లో గుర్తులు చెబుతున్నారని ఇరువర్గాలు వాదించుకుంటున్నాయి. 

ఉదయం 11 గంటలకు 43.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హజీజ్‌నగర్‌లోని 111 నంబర్ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఒక గ్రామానికి చెందిన బ్యాలెట్ పత్రాలు మరో గ్రామానికి చేరడంతో గందరగోళం నెలకొంది.

దీంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. జనగామకు చెందిన బ్యాలెట్ పత్రాలు భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేరిగూడెంకు రావడంతో ఇక్కడ పోలింగ్ నిలిచిపోయింది. 

సూర్యాపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఇరు పార్టీల అభ్యర్ధులు ఓటు వేసేందుకని వెళ్లి ప్రచారం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

ఎండల ధాటికి ఓటర్లు భయపడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఓటర్లతో కిక్కిరిసిన పోలింగ్ కేంద్రాలు.. 10 తర్వాత పోలింగ్ బూత్‌ల వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. 

ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం:

వనపర్తి : 18%
నారాయణపేట : 19.08%
వికారాబాద్‌ : 10 %
సంగారెడ్డి : 18.28 %
జనగామ : 14.68 %
నాగర్‌కర్నూల్‌ : 14.24%
కరీంనగర్‌ : 17.36%
నల్గొండ : 13.03%
సూర్యాపేట : 21.40%
సిద్దిపేట : 16.07%

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలైన 640 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది.

పోలింగ్‌ను త్వరగా ముగించి ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులను వెలుతురు ఉండగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలవుతుందని పోలీస్ శాఖ తెలిపింది.

మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా గగ్గల్లపల్లి ఎంపీటీసీ ఎన్నికను వాయిదా వేశారు. పోటీ నుంచి తనను తప్పుకోవాలంటూ టీఆర్ఎస్ అభ్యర్ధి బెదిరించాడని, దానితో పాటు రూ.10 లక్షలు ముట్టజెప్పాడని కాంగ్రెస్ అభ్యర్ధి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశిస్తూ... ఆ స్థానంలో ఎన్నికను నిలిపివేసింది.