నేడే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా.. కొత్తగూడెం, మునుగోడు బరిలో ?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగా కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. శనివారం ఢిల్లీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) అభ్యర్థుల జాబితాను ఆమోదించింది.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. వ్యూహాప్రతి వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడు ప్రచారంలో పర్వానికి శ్రీకారం చుట్టునున్నది. మరో వైపు.. ఎలాగైనా ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను గద్దెదించి.. అధికార పగ్గాలను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
తన గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలోకి దించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. శనివారం ఢిల్లీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) అభ్యర్థుల జాబితాను ఆమోదించింది. 58 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కె. మురళీధరన్ ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పొత్తు కోసం వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, సీపీఐ, సీపీఎంలకు ఎన్ని సీట్లను కేటాయించాలనే దానిపై అతి త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. 58 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు అక్టోబర్ 17 లేదా 18న మరోసారి సీఈసీ సమావేశం కానుందని తెలిపారు. అక్టోబర్ 19 నాటికి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
మొదటి జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్.. ఆ వెంటనే ప్రచారానికి సిద్ధంగా ఉంది. సీనియర్ నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్ 18 న రాష్ట్రంలో బస్సు యాత్రను ఫ్లాగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బస్సుయాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పర్యటన వివరాల షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేస్తామని టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపి ఎన్. ఉత్తమ్‌కుమార్‌ల మధ్య జరిగిన వామపక్ష పార్టీలతో సీట్ల పంపకాల చర్చలో గతంలో అవిభక్త సిపిఐ, సిపిఎంలకు రెండేసి సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగూడెం, మునుగోడు స్థానాలను సీపీఐకి, భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలను సీపీఎంకు కాంగ్రెస్ ఆఫర్ చేసిందని, దీంతో వామపక్షాలు తమ నిర్ణయాన్ని తెలియజేసేందుకు ఆదివారం వరకు సమయం కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శనివారం రాహుల్‌గాంధీ, వేణుగోపాల్‌తో సమావేశమై టిక్కెట్ల కేటాయింపుపై చర్చించారు. నాగేశ్వరరావును ఖమ్మం నుంచి, శ్రీనివాసరెడ్డిని పాలేరు నుంచి పోటీ చేయాలని అగ్రనేతలు కోరినట్లు తెలుస్తోంది. కానీ, ఈ అంశంపై స్పందించేందుకు నాగేశ్వరరావు నిరాకరించారు. టికెట్ కేటాయింపుపై పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, ఈ అంశంపై వ్యాఖ్యానించి పార్టీని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు.
వామపక్షాలు తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించనప్పటికీ, 2004లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వాన్ని గద్దె దించిన దాదాపు 20 ఏళ్ల తర్వాత పొత్తు పునరుద్ధరణకు నోచుకోనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ వామపక్షాలతో 'మహాకూటమి'ని కోరినప్పటికీ, సీపీఐ మాత్రమే ఆ పార్టీతో చేతులు కలిపింది, అయితే సీపీఎం 28 రాజకీయ పార్టీలు, సామాజిక, మైనారిటీ సంస్థల కూటమి అయిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌లో చేరింది.