హైదరాబాద్ శివారు కీసరలో తొలిరోజు కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మారిన వ్యక్తులను ద్రోహులుగా ప్రకటించాలంటూ ఓ నేత కోరినట్లు సమాచారం. 

హైదరాబాద్ (hyderabad) శివారు కీసరలో తొలిరోజు తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ (chintan shivir) సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రాజకీయ కమిటీలో పార్టీ ఫిరాయింపులపై చర్చ జరిగింది. తెలంగాణ ఇచ్చిన ఉద్దేశ్యాలను నెరవేర్చేందుకు సమగ్రమైన రోడ్ మ్యాప్‌ని తయారు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) తెలిపారు. కాంగ్రెస్‌లో (congress) గెలిచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలను పార్టీ ద్రోహులుగా ప్రకటించాలని ఓ మాజీ ఎమ్మెల్యే సూచించినట్లుగా తెలుస్తోంది. 

చింతన్ శిబిర్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు భట్టి వెల్లడించారు. చర్చకు వచ్చిన అంశాలను క్రోడీకరించి.. వారిచ్చిన నివేదికపై రేపు ఉదయం చర్చిస్తామని ఆయన తెలిపారు. రేపు ఉదయం 8.30 నుంచి 9.30 వరకు గాంధీ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. అనంతరం 11 గంటలకు చింతన్ శిబిర్ తిరిగి ప్రారంభమవుతుందని భట్టి చెప్పారు. పార్టీ మారిన వారిని తిరిగి చేర్చుకోవద్దని తీర్మానం చేయాలని సదరు మాజీ ఎమ్మెల్యే సూచించినట్లుగా తెలుస్తోంది.