రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తంగళ్లపల్లి టైక్స్ టైల్ పార్క్ సమీపంలోని ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తంగళ్లపల్లి టైక్స్ టైల్ పార్క్ సమీపంలోని ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ గోడౌన్‌లో రేషన్ బియ్యం నిల్వచేసినట్టుగా చెబుతున్నారు. అగ్ని ప్రమాదంతో భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని గోడౌన్ సిబ్బంది చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. దీపావళి పండుగ కోసం జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన క్రాకర్స్ స్టాల్స్‌లో మంటలు చెలరేగాయి. మొత్తం 19 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. అందులో ఒక స్టాల్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మరో రెండు స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరోకరు గాయపడ్డారు. మృతులను బ్రహ్మం, కాశీగా గుర్తించారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదు.
ఇక, పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో ఓ బైక్ షోరూంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి ధమాకా అమ్మకాలకు తెచ్చిన బ్యాటరీ బైక్ లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం అని షోరూమ్ యజమాన్యం అనుమానిస్తుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో యాభై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
