హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత బస్తీలో ఈ ప్రమాదం  జరిగింది. పాత బస్తీలోని బహదూర్ పురలోని ట్రాన్స్ పోర్టు గోదాములో శుక్రవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

గోదాములో బొగ్గు నిల్వ ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. క్రమంగా అవి మరో నాలుగు గోదాములకు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఎనిమిది ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీనికోసం సిబ్బంది ఆరు గంటలపాటు కష్టపడాల్సి వచ్చింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, భారీగా ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. కాగా, అగ్నిప్రమాదం వల్ల రూ.50 లక్షల మేర నష్టపోయామని యజమానులు వెల్లడించారు.