మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గండిమైసమ్మ చౌరస్తా వద్ద మణికంఠ ప్లాస్టిక్‌ దుకాణంలో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణం తెరిచే ఉంది. ప్రభుత్వం విధించిన గడువు మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు యజమాని దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. ఆ కాసేపటికే షాపులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలోంచి  పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లి వుంటుందని అంచనా.