గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఫతేనగర్‌లో మాస్క్ లేకుండా కస్టమర్స్ ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2వేల జరిమానా విధించారు అధికారులు. 

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. మరింత పకడ్బందీగా కోవిడ్ నిబంధనల అమలులో భాగంగా.. మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

మాస్క్‌ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ చట్టాల ప్రకారం రూ. 1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది. 

ఇక హోలీ వేడుకలను బహిరంగంగా జరుపుకోవడాన్ని కూడా సర్కారు నిషేధించింది. దీనితో పాటు షబ్-ఏ-బరాత్, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ లాంటి పండుగల వేడుకలపైనా ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించింది.