తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరితహారం పథకం ఒకటి. దీనికోసం కోట్ల కొద్ది రూపాయలను కుమ్మరిస్తోంది సర్కారు. తెలంగాణలో కోట్ల మొక్కలు నాటి సంరంక్షించే పనికి పూనుకున్నది కేసిఆర్ సర్కారు.

అయితే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి. నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారుతున్నాయి. కరీంనగర్ లో కేసిఆర్ నాటిన మొక్క ఎండిపోయిందన్న ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా సాగింది. సిఎం నాటిన మొక్కకే దిక్కు లేకపోతే మిగతా మొక్కలు ఉత్తదేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో హరితహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కానీ తెలంగాణ సిఎం కేసిఆర్ ఇక్కడ నాటిన మొక్క బాగానే పెరిగి పెద్దదైంది. 2015 జూలై మూడవ తేదీన చిలుకూరు బాలాజీ ఆలయంలో మొక్కను నాటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణకు హరితహారాన్ని మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి తెలంగాణకు హరితహారం వేయాలన్న సంకల్పంలో భాగంగా నాటిన మొదటి మొక్క చిలుకూరు ఆలయంలోనిదే.  ఆరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నాటిన సంపెంగ మొక్క మూడేళ్లలో చక్కగా పెరిగింది. ఆలయ పూజారులు, సిబ్బంది కూడా చెట్టు సంరక్షణ బాధ్యతను చక్కగా చూసుకుంటున్నారు.

అంతేకాదు ఈ సంపెంగ చెట్టుకు పూచిన పూలను, ఆకులను నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే అర్చనలో వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి హరితహారం లక్ష్యం నెరవేరాలని నిత్య పూజల్లో ఆలయ పూజారులు ఆ దేవుడిని వేడుకుంటున్నారు.

ఈ యేడాది కురుస్తున్న మంచి వర్షాలు హరితహారంలో నాటిన మొక్కలకు జీవం పోస్తాయని, ఈ మొక్కలే రానున్న రోజుల్లో చెట్లుగా మారి పర్యావరణ రక్షణకు ఉపయోగపడుతాయని ఆలయ పూజారి రంగ రాజన్ తెలిపారు. రోడ్ల వెంట, ఖాళీ స్థలాలు, సంస్థలు, స్కూళ్లు, దేవాలయాలు  ఇలా ప్రతీ ఆవరణలో నాటిన మొక్కలు అనుకూల వాతావరణంలో పెరుగుతూ ఫలితాలను ఇస్తున్నాయి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/bvNpCW