హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఆమ్లెట్ కోసం ఓ వ్యక్తి నిండు ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం రూ. 60 కోసం ఓ వ్యక్తి ప్రాణాలను నిలువునా తీశారు. 

వివరాల్లోకి వెడితే...లంగర్ హౌజ్ కు చెందిన వికాస్ (35) ప్రైవేట్ ఉద్యోగి. పీర్జాదిగూడలో ఉండే స్నేహితుడు బబ్లూతో ఆదివారం సాయంత్రం ఉప్పల్ కు వచ్చాడు. ఇద్దరూ అక్కడి మహంకాళి వైన్స్ కు వెళ్లారు. పర్మిట్ రూంలో మద్యం తాగుతూ ఆమ్లెట్ కు ఆర్డర్ ఇచ్చారు. 

ఆమ్లెట్ కు రూ.60 ఇవ్వాలని వైన్స్ యజమాని వికాస్ ని అడిగాడు. దీంతో కోపానికి వచ్చిన వికాస్ షాపు యజమానితో గొడవకు దిగారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్రఆగ్రహానికి లోనైన షాపు యజమాని తన సిబ్బందితో వికాస్, బబ్లూలమీద దాడి చేయించాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వికాస్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.