కరోనా వైరస్ ఇరు వర్గాల మధ్య  చిచ్చు పెట్టింది. మీ వల్లే చాలా మందికి కరోనా వచ్చిందంటూ ఓ వర్గం వారు.. కరోనా సోకిన వ్యక్తిని, వారి బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  మండలంలోని నరసింహాపురం గ్రామంలో కొంత మందికి కరోనా సోకింది. అయితే..  కొంత మందికి కరోనా రాకపోయినా వచ్చిందంటూ ప్రచారం చేశారు. దీంతో.. ఓ కుటుంబం కారణంగా గ్రామంలో చాలా మందికి కరోనా సోకిందని.. అంతేకాకుండా.. వాళ్లు ఇతరులకు కూడా కరోనా సోకిందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో..  కరోనా సోకిన వ్యక్తి, ఆయన బంధువులపై దాడి చేశారు.

ఈ దాడి కాస్త ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రెండు వర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇరువురి ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.