తెలంగాణ ఎన్నికల పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడింది. ఎన్నికల ప్రచారం కూడా బుధవారంతో ముగిశాయి. పోలింగ్ కి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో..ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పలు పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

గురువారం ఉదయం శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, మహాకూటమి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు.
 
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ తమ్ముడు రాహుల్ కిరణ్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడం ఆలస్యం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలే వారిని అడ్డుకున్నారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వారే డబ్బులు పంచుతూ ఉంటే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. సంగారెడ్డి డీఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.