హైదరాబాద్: ఏ తండ్రి అయినా తమ పిల్లలు తనకంటే పెద్ద స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు. ఆ స్థాయికి తెచ్చే వరకు ఎంతో కష్టపడతారు. తనకంటే పెద్ద స్థాయికి చేరుకున్నాక ఆ తండ్రికి అంతకు మించి ఆనందం ఏముంటుంది. అదే ఆనందాన్నిఓ తండ్రి అనుభవించాడు. 

తన చేతుల్లో చిన్నప్పుడు అల్లారుముద్దుగా పెరిగి ప్రస్తుతం తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నఆమెకు ఆ తండ్రి సెల్యూట్ చేశాడు. ఈ అద్భుత దృశ్యానికి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ వేదికైంది.

టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్నప్రగతి నివేదన సభ వద్ద మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ తండ్రి కూతుళ్లు కావడం విశేషం. 1985వ సంవత్సరంలో ఎస్‌ఐగా విధుల్లో చేరిన ఉమామహేశ్వర శర్మ ప్రస్తుతం నాన్‌ క్యాడర్ ఎస్పీహోదాకు వచ్చారు. 

ఉమామహేశ్వర శర్మ కుమార్తె సింధూశర్మ 2014 బ్యాచ్ ఐపీఎస్‌‌గా ఎంపికై పెద్దపల్లిలో తొలి పోస్టింగ్ లో చేరారు. ఇటీవలే జగిత్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. అయితే పోలీసు డ్యూటీలో భాగంగా నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో ఉన్న ఉమామహేశ్వర శర్మ, డైరెక్ట్ ఐపీఎస్ అధికారిణి అయిన తన కూతురు సింధూకు సెల్యూట్ చేయడం అరుదైన సన్నివేశంగా మిగిలిపోయింది. 
తన కూతురు పెద్ద హోదాలో ఉండడం, ఆమెకు తండ్రి సెల్యూట్ చేయడాన్ని గమనించిన తోటి పోలీస్ సిబ్బంది ఆ తండ్రికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది అని ముచ్చటించు కోవడం కనిపించింది.