కొన్ని నెలల క్రితం తలలేకుండా కేవలం ఓ వ్యక్తి మొండెం కరీంనగర్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసు మిష్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసులో తండ్రే హంతకుడని తేలిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని కన్న తండ్రే అతి కిరాతకంగా అంతం చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గంభీరావుపేట మండలం పెద్దమ్మ అడవుల్లో జూలై 24న ప్రధాన రహదారి పక్కనే తల లేని మొండాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. హతుడు, హంతకుడి ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 3నెలలు శ్రమించారు.
 
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి, మిస్సింగ్‌లపై దృష్టిసారించారు. పోస్టర్లు అంటించి, ఆచూకీ కోసం అన్వేషించారు. కామారెడ్డిలో దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి మిస్సింగ్‌ అయినట్టు తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సీఐ రవీందర్‌ ఆ దిశగా కేసు విచారణ చేపట్టారు. దుర్గాప్రసాద్‌ తండ్రి వెంకట్‌ను ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్ఠేషన్‌కు పిలిపించి, అతడి రక్త నమూనాలు సేకరించారు.
 
డీఎన్‌ఎ టెస్ట్‌ కోసం ల్యాబ్‌కు పంపించారు. అదే రోజు వెంకటిని అనుమానం రాకుండా ఎల్లారెడ్డిపేట పోలీస్‌లు పంపించేశారు. పెద్దమ్మ అడవుల్లో లబించిన తలలేని మొండానికి సంబంధించిన రక్త నమూనాలు, వెంకటి రక్త నమూనాలు ఒకటే కావడంతో పోలీస్‌లు విచారణను మరింత ముమ్మరం చేశారు. అప్పటి నుండి వెంకటి కాల్‌డేటా, కదలికలపై పోలీస్‌లు నిఘా పెట్టారు. మరోసారి దుర్గాప్రసాద్‌ తండ్రి వెంకటిని ఎల్లారెడ్డిపేట ఠాణాకు పిలిపించారు. పెద్దమ్మ అడవుల్లో చనిపోయింది మీ కొడుకేనంటు పోలీస్‌లు వెంకటి చెప్పి, కొన్ని వివరాలు రాబట్టారు. అనంతరం పంపించేశారు.
 
ఎల్లారెడ్డిపేట పోలీసులకు కొడుకును తనే చంపేశానని తెలిసిపోయే అవకాశం ఉందనే భయంతో నిందితుడు వెం కటి కామారెడ్డి పోలీస్‌ల ఎదుట 3 రోజుల కిందట లొంగిపోయాడు. దీంతో అతడు ఇచ్చిన సమాచారం మెరకు కామారెడ్డి సమీపాన ఉన్న వాగులో దుర్గాప్రసాద్‌ తల లభ్యమైంది. కొడుకు దుర్గప్రసాద్‌ అన్ని వ్యవసనాలకు బానిసై ఉన్మాదిగా తయారైనందుకే హత్య చేశానని పోలీస్‌ల విచారణలో నిందితుడు వెంకటి వ్లెడించినట్టు సీఐలు రవీందర్‌, రామకృష్ణ వెల్లడించారు.

ఇంట్లోనే మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక కత్తితో మెడను నరికేసి హత్య చేశానని పోలీస్‌ల సమక్షంలో వెంకటి వెల్లడించారు. అనుమానం రాకుండా మెండాన్ని సంచిలో వేసుకుని స్కూ టీపై పెద్దమ్మ అడవుల్లో పారేశానని తెలిపాడు. తిరిగి వస్తు కామారెడ్డి వాగులో తలను పడేశానని నిందితుడు వెంకటి వెల్లడించాడు.