తండ్రి...కన్న కొడుకుని ఆవేశంలో గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత నేరం ఎక్కడ తనపై పడుతుందో అని భయపడి ఇంటి సమీపంలోని బోరు బావిలో పాతి పెట్టాడు. మూడు రోజలు పాటు ఈ నిజం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు తనలో తానే కుమిలిపోయి... తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ సంఘటన  మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ కి చెందిన కోమాండ్ల నారాయణరెడ్డి ఇబ్రహీంపూర్‌ సొసైటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. అతడికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు శ్రావణ్‌ కుమార్‌రెడ్డి(23) హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. దసరా పండగకు ఇంటికి వచ్చిన అతడు సోమవారం రాత్రి నుంచి కనిపించకుండాపోయాడు. 

కొడుకు అదృశ్యమైనా కుటుంబ సభ్యులు ఎవరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడంతో గ్రామస్థులు నారాయణరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా... తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. 

సోమవారం రాత్రి తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరగగా నారాయణరెడ్డి శ్రావణ్‌కుమార్‌రెడ్డి గొంతు పిసికి చంపినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నారాయణరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫొరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో మృతదేహాన్ని శుక్రవారం బయటకు తీయనున్నారు.