సంగారెడ్డి: కన్న తండ్రే ఈ బాలిక పట్ల కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాడే ముక్కుపచ్చలారని చిన్నారిని అతి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఈ నెల 15న సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్దచెరువులో ఓ మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతిచెందిన చిన్నారి మల్కాపూర్ కు చెందిన  మరియమ్ కురుబా(3)గా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

అయితే చిన్నారి హత్యపై కేసు నమోదు చేసుకుని విచారణ సాగిస్తున్న పోలీసులకు తండ్రి మస్తాన్ వ్యవహారం అనుమానాస్పందంగా కనిపించింది. దీంతో తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు. 

మగ పిల్లాడు పుట్టాలని కోరుకున్న మస్తాన్ ఆడపిల్ల పుట్టడంతో ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. కనీసం చిన్నారిని తాకడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. దీంతో మరియమ్ హైదరాబాద్ లోని అమ్మమ్మవారి ఇంట్లోనే వుండేది. అయితే కరోనా కారణంగా బాలిక హైదరాబాద్ లో వుండటం ప్రమాదకరమని భావించి తల్లిదండ్రుల వద్దకు పంపారు. దీంతో తన కళ్లముందు తిరుగుతున్న ఆడబిడ్డను చూడలేకపోయిన మస్తాన్ దారుణానికి ఒడిగట్టాడు. 

రాత్రి సమయంలో తల్లిపక్కన పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి మల్కాపురం పెద్దచెరువులో విసిరేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించాడు. అయితే అనుమానంతో అతడిని విచారించి నిజాన్ని రాబట్టిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.