క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొన్నది. కూతురు లాంటిదే కదా.. అని కోడలిని మందలించడమే అతను చేసిన నేరమైంది. మామ మందలించడాన్ని తట్టుకోలేక కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఆ నేరం తనమీద పడుతుందనే భయంతో మామ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన  యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మోటకొండూరుకు చెందిన లూర్దు మర్లయ్య(52)కు ఇద్దరు కుమారులు. పెద్ద  కొడుకు జైసన్‌, పెద్దపల్లి జిల్లాకు చెందిన మానస(28) ప్రేమించుకున్నారు. 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. చిన్న కొడుకు లివింగ్‌స్టన్‌ కూడా మానస చెల్లెలు రీచాతో ప్రేమలో పడ్డాడు. ఈ నెల 17న వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఇద్దరు కుమారులు కూడా ప్రేమ వివాహాలు చేసుకోవడంతో మర్లయ్య ఆవేదన చెందాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడి  ప్రేమ వివాహానికి కారణమంటూ పెద్ద కోడలు మానసను మర్లయ్య నిందించాడు. మనస్తాపం చెందిన ఆమె.. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీంతో భయపడిపోయిన మర్లయ్య.. ఇంటికి సమీపంలోని పశువుల కొట్టం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మర్లయ్య భార్య అనారోగ్యంతో ఆరు నెలల క్రితం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.