రోజురోజుకూ అనుబంధాలు మాయమవుతున్నాయి. అప్యాయత, అనురాగం చోటే ద్వేషం, కోపం, అసూయలు వచ్చి చేరుతున్నాయి. డబ్బులకోసం తల్లిదండ్రుల్ని చంపే కొడుకులు, కన్న బిడ్డల్ని హతమార్చే తల్లిదండ్రులు పెరిగిపోతున్నారు. అలాంటి  ఓ దారుణ ఘటనే మెదక్ జిల్లాలో జరిగింది. 

జులాయిగా మారిన కొడుకు పెట్టే బాధలు భరించలేక ఓ కన్న తండ్రి కర్కశంగా మారాడు. మరో వ్యక్తి సహకారంతో కన్న కొడుకునే తుదముట్టించాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. 

నస్కల్ కి చెందిన కుమ్మరి స్వామి (40) జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో పాటు భార్యాపిల్లలనూ తరచూ వేధించేవాడు. అతడి బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వామి మద్యం సేవించి తరచూ తన తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడు. రోజురోజుకూ కొడుకు పెట్టే బాధలు ఎక్కువవుతుండడంతో కొడుకును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు తండ్రి బాలయ్య. 

దీనికోసం అదే గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్‌ రమేశ్‌తో కలిసి స్వామిని ఈ నెల 13వ తేదీ రాత్రి హతమార్చాలని వ్యూహం పన్నాడు. కరెంటు షాక్‌తో హతమార్చాలని వేసుకున్న ప్లాన్‌ అమలు కాలేదు. దీంతో ఇంట్లో పడుకున్న స్వామిపై గడ్డపార, రాడ్డుతో దాడిచేసి హతమార్చారు. 

స్వామి చనిపోలేదనే అనుమానంతో కరెంట్‌ షాక్‌ కూడా పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో బాలయ్య, రమేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిందంతా చెప్పారు.