సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్ల గొంతు కోశాడు. ఈ సంఘటన జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. 

ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు 108 ద్వారా సిద్ధిపేట ఏరియా ఆస్పత్రికి చిన్నారులను తరలించారు 

పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద కూతురు అంజరిన (8), చిన్న కూతురు అరేన (60) ప్రస్తుతం సిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. 

మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ దాదాపు 15 ఏళ్లుగా మిరుగొడ్డి మండలం మోతె గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు. కొంత కాలంగా అతను సైకోలా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో గ్రామస్థులు మోతె నుంచి వెళ్లగొట్టారు. దాంతో కుటుంబంతో సహా అతను చిట్టాపూర్ లో నివాసం ఉంటున్నాడు. 

కాగా, శనివారం ఉదయం ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో తలుపులు మూసి కూతుళ్ల గొంతు కోస్తానని బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే  అతను ఇద్దరు కూతుళ్ల గొంతు కోయడానికి సిద్ధమయ్యాడు.

పోలీసులపైకి కూడా అతను దాడికి ప్రయత్నించాడు. వారు పిల్లలను కాపాడి ఆస్పత్రికి తరలించారు.