అమ్మ కావాలందని... ఆరేళ్ల కూతురి ముక్కు, నోరు మూసి చంపేసిన తండ్రి..
పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి రప్పించాలని కన్న కూతుర్ని కర్కశంగా చంపేశాడో కసాయి తండ్రి. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మహబూబ్ నగర్ : తల్లి నుంచి దూరమైన ఓ చిన్నారి తల్లి కావాలని పట్టుబట్టడంతో.. కన్నతండ్రే అత్యంత కర్కశంగా హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య మీద ఉన్న కోపాన్ని ఆరేళ్ల కుమార్తెపై చూపించాడు ఆ కిరాతకుడు. అమ్మ కావాలని ఏడుస్తున్న చిన్నారిని ముక్కు, నోరు మూసి చంపిన అమానవీయ ఘటన కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ఠాణా ఎస్సై వెంకటేశ్వర్లు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇలా తెలిపారు.
మహబూబ్నగర్ మండలం పాలకొండ తండాకు చెందిన శివకు ఏడేళ్ల క్రితం అదే తండాకు చెందిన శోభ అనే మహిళతో పెద్దలు పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. శివ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవలి కాలంలో మద్యానికి బానిసై శోభను తరచుగా విపరీతంగా కొట్టడం మొదలు పెట్టాడు. భర్త ప్రవర్తనతో విసిగి పోయిన శోభ పది రోజుల క్రితం ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, మత్తు దిగిన తర్వాత చేసిన విషయం అర్ధం అయ్యింది భార్యను ఇంటికి తిరిగి రావాలని పలుమార్లు అడిగాడు.
బాలికపై.. ఒకరికి తెలియకుండా మరొకరు అన్నదమ్ముల అత్యాచారం.. బ్లాక్ మెయిల్ చేస్తూ..
అయితే తిరిగి వచ్చిన తర్వాత అతని ప్రవర్తన మళ్లీ అలాగే ఉండటంతో ఆమె రావడానికి ఇష్టపడలేదు. దీంతో భార్యను ఎలాగైనా ఇంటికి తిరిగి రప్పించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం పెద్ద కూతురు కీర్తన (6) ఓ దుకాణం దగ్గర అతనికి కనిపించింది. ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లాడు. రాత్రి పడుకునే టైంలో కీర్తన తల్లి కావాలని ఏడ్చింది. దీంతో కోపానికి వచ్చిన శివ.. ఆ చిన్నారి ఏడవకుండా ఆమె ముక్కు, నోరు మూసేసాడు.
ముక్కు నోరు మూయడంతో ఊపిరి ఆడక చిన్నారి గిలగిలా కొట్టుకుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భయపడ్డ తండ్రి, తాతతో కలిసి మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించిందని తెలిపారు. ఈ అనుకోని పరిణామానికి శోభ హతశురాలయ్యింది. కూతుర్ని చంపేస్తే ఇంటికి తిరిగి వస్తానని ఉద్దేశంతోనే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.