కొడుకు తప్పు చేస్తే బుద్దిచెప్పాల్సింది పోయి తానూ చేయి కలిపాడో ఆధునిక తండ్రి. కొడుకు ఫ్రెండ్స్ తో కలిసి ఏకంగా బ్యాంకు దోపిడీకి ప్రయత్నించారు. వివరాల్లోకి వెడితే.. ఈ నెల 15న కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూరు ఎస్బీఐ బ్యాంకులో దోపిడికి ప్రయత్నించి పారిపోయిన ముఠా సభ్యలను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

శుక్రవారం సీపి వి.బి. కమాలసన్ రెడ్డి పట్టుబడిన నిందుతుల వివరాలను మీడియాకు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పేరపల్లికి చెందిన దూలం రాజు బైకర్, రొంపికుంట గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజేష్ బైక్ మెకానిక్, సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన బాలసాని అజయ్ ఇంటర్ పూర్తి చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన వెన్నపూసల రాజేష్ రెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. 

వీరందరూ హైదరాబాద్ లోని ఓ గదిలో ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలు చేయాలనుకున్నారు. దీనికోసం ఊరికి దూరంగా ఉండే ఊటూరు ఎస్బీఐ బ్యాంకును ఎంచుకున్నారు. ఈ విషయం మిగతా స్నేహితులకు చెప్పారు.

చివరకు రాజు తన తండ్రి దూలం సంపత్ కు కూడా ఈ విషయం చెప్పడం, దీనికి తండ్రి కూడా సై అని వారికి అండగా నిలిచాడు. ఈ నెల 15న అర్థరాత్రి 12.45 గంటలకు అందరూ కలిసి ఊటూరు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకు వద్దకు వచ్చారు. సంపత్, అజయ్, రాకేష్ రెడ్డిలు లోపటికి వెళ్లి అలారం వైర్లు తొలగించి స్ట్రాంగ్ రూం గది తాళాలను పగులగొట్టారు. 

కానీ బంగారం, నగదు ఉన్న బీరువాను తెరువలేకపోయారు. అంతేకాదు పోలీసులు ఎక్కువగా తిరుగుతున్నట్లు భయపడి బ్యాంకులో ఏం దొంగిలించకుండానే బయటకు వచ్చారు. తమ ప్లాన్ ఫెయిలవ్వడంతో సంపత్ నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీసులు ప్రశ్నించి పేరు, చిరునామా నమోదు చేసుకున్నారు. 

ఇది గమనించిన మిగతా ముఠా సభ్యులు వారి టూవీలర్ పై పారిపోయారు. అదనపు డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కేసును ఛేదించారు. వారి నుంచి రెండు టూ వీలర్లు, తల్వార్, ఇనుపరాడ్ లను స్వాధీనం చేసుకున్నారు. మానకొండూర్, సీసీఎస్, ఐటీ సెల్ టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైం పోలీసులకు రివార్డ్ అందించి సీపీ అభినందించారు.