ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.యాచారం మండలంలోని మేడిపల్లిలో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వెళ్లాడు. 

పంటల పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే కాన్వాయ్ పై రైతులు చెప్పులు విసిరారు. రైతులు ఎమ్మెల్యే కాన్వాయ్ పై చెప్పులు విసరడంతో పోలీసులు రైతులపై లాఠీచార్జీ చేశారు. రైతులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

దీంతో పోలీసులు భారీగా మోహరించారు.భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇవాళ పరిశీలిస్తున్నారు. మేడిపల్లికి ఎమ్మెల్యే వెళ్లిన సమయంలో రైతులు ఆయన ప్రయాణీస్తున్న కాన్వాయ్ పై చెప్పులు విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. 

ఫార్మాసిటీ ఏర్పాటులో మేడిపల్లి గ్రామం  మొత్తం పోయే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయంతో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఆయనను అడ్డుకొన్నారు. తమ గ్రామం ఫార్మాసిటీలోకి వెళ్లడానికి  ఎమ్మెల్యే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కోపంతో ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకొన్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. పంట నష్టం అంచనాలు వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇవాళ సీఎం కేసీఆర్ వర్షాలు, వరదలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.