ఉన్నతాధికారులకు ఉదయం లేచిన దగ్గర నుండి ప్రజల నుండి ఎన్నో విజ్ఞప్తులు, మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. సేమ్ అలానే ఒకరోజు ఒక బలహీన వర్గానికి చెందిన దేవారామ్ నాయక్ అనే ఒక రైతు నుండి రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో తన బతుకుదెరువు నిమిత్తం సాగు చేసుకుంటున్న భూమి సమస్య ఉందని... జిల్లా అధికారులకు తన సమస్యపై ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా తన సమస్య పరిష్కారం కాలేదని, ఇంతకు ముందు కలెక్టర్లకు తన సమస్యను విన్నవించుకున్నానని దయచేసి తనకు తన భూమికి సంబంధించిన సమస్య పరిష్కరించాలని కోరాడు. 

అందరు అధికారుల్లా రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కూడా దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. వెంటనే సంబంధిత అధికారులకు ఆ సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశాలిచ్చాడు. రెవెన్యూ సమస్య కావటంతో అధికారులు మళ్ళి ఆలస్యం చేస్తారనే ఆలోచనతో తానే స్వయంగా అధికారులతో ఆయా రికార్డ్ లను సరిచేసి... 48 గంటల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చేలా చేసారు. ఆ పని అయిపోయిన వెంటనే ఆ మండల అధికారులు ఆ రైతు దేవరాం నాయక్ కు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ రైతు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

వివరాల్లోకి వెళ్తే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దేవారామ్ నాయక్ అనే రైతు కుటుంబానికి సంబంధించిన భూమిని కొందరు రెవెన్యూ  అధికారులు పొరపాటున అదనంగా వేరే రైతులకు డబల్ పట్టాలు చేయించారు. దాంతో అతనికి రైతు బంధు కానీ వేరే ఇతర ప్రభుత్వ పథకాలు కానీ అందటం లేదు. తన భూమి కూడా వేరే వారిపై చూపిస్తుంది. గత మూడు సంవత్సరాల నుండి ఆ రైతు ఎందరో అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

దాంతో రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ ఫోన్ నెంబర్ ని ఇంటర్నెట్ లో సంపాదించి కలెక్టర్ కె స్వయంగా మెసేజ్ చేశాడు. కలెక్టర్ కి మెసేజ్ చేస్తే కనీసం తన సమస్యను డైరెక్ట్ గా వెళ్లి చెప్పచ్చు అనుకున్నాడు కానీ వెంటనే కేవలం మెసేజ్ తోనే పరిష్కారం కూడా అయిపోతుందని కూడా ఊహించలేదు. ఏది ఏమైనా ఆ రైతు రంగారెడ్డి కలెక్టర్ తనకు ఆ సహాయం చేయగానే ఎన్నో సంవత్సరాల నుండి తాను ఈ సమస్య గురించి చెప్పులరిగేలా తిరిగానని ఇంత తొందరగా పరిష్కారం చూపినందుకు కలెక్టర్ కి ఒక  రైతు బిడ్డగా జీవితాంతం రుణపడి ఉంటానని మెసేజ్ చేస్తూ దేవారామ్ నాయక్ కృతజ్ఞతలు తెలియజేసాడు. ఈ విషయాన్నంతా అతను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. దాంతో అతని మెసేజ్ లను పోస్ట్ చేస్తూ కొందరు నెటిజన్లు కలెక్టర్ ని ప్రశంశిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.