మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్న యువకుడిని తల్లిదండ్రులు, అన్నదమ్ములు కలిసి హతమార్చారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్లలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అతడు మద్యానికి బానిసయ్యాడు. రోజూ ఇంటికి తాగొచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవాడు. అతడి సంపాదన మొత్తం తాగడానికే సరిపోయేది. ఇంకా డబ్బులు కావాలని ప్రతీ రోజూ తల్లిదండ్రులను వేధింపులకు గురి చేసేవాడు. దీంతో కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరిగేవి. అతడి చేష్టలతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనారావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బాలయ్య గౌడ్, లావణ్య దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు నిఖిల్ (23) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ యువకుడు ఒమన్, మలేషియాలో పనిచేసి ఏడాది క్రితం స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులందరినీ తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడు.
నిఖిల్ పని చేసిన డబ్బులు మద్యానికే సరిపోకపోయేవి. దీంతో డబ్బుల కోసం తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టేవాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఆ యువకుడికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా నిఖిల్ మారలేదు. అదే ప్రవర్తనను కొనసాగించాడు. దీంతో అతడి వికృత చేష్టలను వారు భరించలేకపోయారు. అయినా వారు ఓపికపడుతూ వచ్చారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లిన నిఖిల్ కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. అల్లరి చేయకుండా పడుకోవాలని కుమారుడికి తండ్రి బాలయ్య చివాట్లు పెట్టాడు. దీంతో నిఖిల్ కు కోపం వచ్చింది. తండ్రిపై రోకల బండ తీసుకొని దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు బాలయ్యగౌడ్ నిఖిల్ నుంచి రోకలి బండను లాక్కొని అతడిపై దాడి చేశాడు. కుమారుడు తమపై మళ్లీ దాడికి పాల్పడతాడనే భయంతో బాలయ్య గౌడ్ తన భార్య లావణ్య, మరో ఇద్దరు కుమారులు వంశీ, అజయ్‌తో కలిసి నిఖిల్ను గట్టిగా పట్టుకున్నారు. అనంతరం గొంతుకు తాడును బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
ఈ ఘటన జరిగిన అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం అందించారు. హత్యపై గ్రామ రెవెన్యూ అధికారి నళిని కోనరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలయ్యగౌడ్, అతని భార్య లావణ్య, ఇద్దరు కుమారులను ఐపీసీ సెక్షన్ 302 కింద అరెస్టు చేశామని, నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తామని ఎస్‌ఐ ప్రేమ్ ప్రదీప్ తెలిపారు.
