చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వరదనీటితో ఉప్పొంగుతున్న వాగును దాటాల్సి వచ్చింది.
సిద్దిపేట : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇలా సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామాన్ని కూడా వరదనీరు చుట్టుముట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలాంటి సమయంలో ఆ గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబసభ్యులు నానా తంటాలు పడ్డారు. మృతదేహాన్ని మోస్తూనే వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటాల్సి వచ్చింది. ఇలా మృతుడి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగులోనే అంతియమాత్ర చేపట్టారు.
గత వారం రోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల మాదిరిగానే సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురుసి వరదనీటితో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలా చేర్యాల సమీపంలోని ఓ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలో గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్దుడు మృతిచెందాడు. అయితే మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లాలంటే వరదనీటితో ఉప్పొంగుతున్న వాగు దాటాలి... దీంతో కుటుంబసభ్యులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది.
వీడియో
ప్రాణాలను అరచేతిలో పట్టుకుని వరదనీటితో ఉప్పొంగుతున్న వాగుమీదుగానే అంతిమయాత్ర నిర్వహించారు కుటుబసభ్యులు. ఓ ఇద్దరు పెద్ద కర్ర తీసుకుని వాగు లోతును పరిశీలిస్తూ ముందువెళ్లగా ఇంకొందరు శవాన్ని మోస్తూ వెనక నడిచారు. విచిత్రం ఏమిటంటే ఇంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ డప్పు వాయిస్తూ శవాన్ని తరలించారు.
ఎలాగోలా వాగు దాటి స్మశానవాటికకు చేరుకుని వృద్దుడి మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం మళ్ళీ అదేవాగును దాటుకుని గ్రామానికి చేరుకున్నారు. ఇలా ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు తంటాలు పడ్డారు.
