అతను ఇళ్లు వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడా అని కుటుంబసభ్యులు అంతా వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత టిక్ టాక్ ద్వారా అతని జాడ కుటుంబసభ్యులు కనిపెట్టారు. ఈ సంఘటన ఖమ్మంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు అనే మూగ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం కూలీ పని కోసం పాల్వంచ వెళ్లాడు. ఆ తరువాత ఇంటికి చేరలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు వారం పాటు చుట్టుపక్కల , బంధువుల ఇళ్లల్లోనూ వెతికారు. అయినా జాడ లభించక పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లుకి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదే గ్రామానికి చెందిన కలసాని నాగేంద్రబాబు అనే యువకుడు సోమవారం తన ఫోన్‌లో టిక్‌టాక్‌ వీడియోలు చూస్తుండగా వెంకటేశ్వర్లు కనిపించాడు. అతడిని గుర్తుపట్టిన నాగేంద్రబాబు విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అతడు పంజాబ్‌లో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపాడు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని వెంకటేశ్వర్లు ఇంటికి చేరేలా సహకారం అందించాలని వేడుకుంటున్నారు.