హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని పాతబస్తీలో వరద భీభత్సం సృష్టించింది.ఫలక్‌నుమా బ్రిడ్జిపై ఆరడుగుల గొయ్యి ఏర్పడింది. దీంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

నగరంలోని చాదర్‌ఘాట్ వద్ద మూసీపై ఉన్న బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది.  శనివారం నాడు సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.

మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుండి మూసీ ఉప్పొంగింది. మూడు రోజుల క్రితం కూడ  మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహించింది. అయితే ఇవాళ కూడ మూసీ మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. పలు వాహనాలు కూడ వరద నీటిలో కొట్టుకుపోయాయి.

సరూర్‌నగర్, దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాల్లోని కమలానగర్, కోదండరామనగర్, వివినగర్ తదితర కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.ఇండ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు  వరదలో కొట్టుకుపోయాయి.

ఈ నెల 13వ తేదీన రాత్రి భారీ వర్షం కురిసింది. దీని ప్రభావం మూడు రోజుల పాటు కన్పించింది. వరదల నుండి తేరుకొన్నామని ఊపిరిపీల్చుకొన్న ప్రజలకు శనివారం నాడు కురిసిన వర్షం మరోసారి ఇబ్బందులను తెచ్చిపెట్టింది.పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. 

కోఠి నుండి మలక్‌పేట్, అంబర్ పేట్ నుండి దిల్‌సుఖ్ నగర్ వైపు రాకపోకలను నిలిపివేశారు. ఉప్పల్, టోలిచౌకి, ఫలక్ నుమా, అంబర్ పేట, హయత్ నగర్ , జిల్లెలగూడ తదితర ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి.