ఎస్ఐ వేషం వేసి నలుగురినీ మోసం చేయడం కామన్ అయిపోయింది. అలాగే ఓ మహిళ కూడా ఎస్సైనంటూ చెప్పుకుంటూ.. యువకులనుంచి లక్షల రూపాయలకు వసూలు చేసింది. ఏకంగా ఓ యువకుడిని ఎస్సైనంటూ పెళ్లి కూడా చేసుకుంది. 

సిద్దిపేట : ప్రతిభ కలిగిన మహిళా Sub-Inspectorగా ప్రచారం.. ఉద్యోగాల పేరిట యువకులకు గాలం.. లక్షల్లో వసూలు.. చివరికి అందరికీ కుచ్చుటోపి.. ఇదంతా ఓ కి‘లేడీ’.. ఆడిన నాటకం. 2021 డిసెంబర్లో Siddipet District నారాయణపేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు పోలీసుశాఖలో ఉద్యోగానికి ఆశపడి SIగా పరిచయమైన మహిళకు రూ. 10 లక్షలు ముట్టచెప్పాడు. తరువాత ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆమె నాలుగు రోజుల కిందట పోలీసులకు పట్టుబడింది. విచారణలో ఆమె సిద్దిపేట సహా ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పదుల సంఖ్యలో యువకులను మోసగించినట్లు తేలింది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు సిద్దిపేట గ్రామీణ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన విజయభారతి డిగ్రీ పూర్తి చేసింది. 2018లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నది. కానీ ఎంపిక కాలేదు. గతంలో మహబూబాబాద్ కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. రూ. 13 లక్షల వరకు అప్పులు తెచ్చి అతగాడికి ముట్టజెప్పి మోసపోయింది. ఆ అప్పులు తీర్చేందుకు ఎస్ఐ అవతారమెత్తింది. ఎస్ఐ పరీక్షలకు సంబంధించి నకిలీ ఫలితాలు, ధ్రువ పత్రాలు సృష్టించింది.

ఎస్ఐగా ఎంపికైనట్టు నమ్మించి ప్రముఖులతో సత్కారాలు అందుకుంది. ఆ ఫోటోలను చూపిస్తూ పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని ఉచ్చులోకి దింపింది. నారాయణరావు పేటకు చెందిన ఓ యువకుడి నుంచి రూ. 10 లక్షలు గుంజింది. అతని ద్వారా మల్లన్నసాగర్ లో ముంపు బాధితుల నుంచి బాండ్ పేపర్ రాయించుకుని రూ. లక్షలు తీసుకుంది. ఎస్ఐని అంటూ వరంగల్ కు చెందిన ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకుంది. వారికి ఇప్పుడు నాలుగు నెలల బాబు.

సాంకేతికతతో మాయ చేసి..
హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటూ 50 మంది నుంచి రూ. 70 లక్షల వరకు వసూలు చేసింది. చాలా నెలల పాటు టవర్ లొకేషన్ తెలియనీయకుండా సాంకేతికత ఆధారంగా పక్కదారి పట్టించింది. ఈ క్రమంలో సిఐ జానకి రామ్ రెడ్డి, ఎస్సై అమరేందర్ విచారణ ముమ్మరం చేశారు. భర్తను పట్టుకుని అతనితో ఫోన్ చేయించగా హుస్నాబాద్ లో ఉన్నట్టు తెలియగానే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్టులో ఇలాంటి నకిలీ పోలీసు భాగోతం చెన్నైలో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి భార్య కోసం పోలీస్ కమిషనర్ అవతారమెత్తి, డబ్బులు వసూలు చేస్తున్నాడు. సదరు తమిళనాడు రాష్ట్రంలోని కొలత్తూరుకు చెందిన విజయన్‌ అనే వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తన వాహనానికి సైరన్ బిగించుకొని ఏడాది కాలంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా విజయన్ ను పోలీసులు గుర్తించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీలతో కూడ ఆయన ఫోటోలు దిగారు. విజయన్ గతంలో న్యూస్ ఛానెల్‌లో పనిచేశాడు. 

ఆ సమయంలో తనకున్న పరిచయాలతో వీఐపీలతో ఫోటోలు దిగినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు. దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం జిల్లా టోల్ గేట్ వద్ద వాహనానికి సైరన్ పెట్టుకొని వెళ్తున్న సమయంలో పోలీసులకు అనుమానం వచ్చి అతడిని పరిశీలించారు. ఆయన సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అతడిని విచారించారు. విజయన్ నుండి నకీలీ ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. లారీల వ్యాపారం చేసిన విజయన్ వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో ఖాళీగా ఉండడంతో, ఏదైనా పనిచేయాలంటూ భార్య గొడవ 

దీంతో అతను పోలీస్ అవతారం ఎత్తాడు.గ్రూప్-1 ఉద్యోగం పాసై పోలీస్ అయినట్టు, కమిషనర్ గా ప్రమోషన్ పొందానని కూడ నమ్మించాడు. తన స్నేహితురాలి సహాయంతో ఓ జీపును కొని, దానికి సైరన్ బిగించాడు. నకిలీ పోలీస్ ఐడీ కార్డును సృష్టించి డబ్బులు వసూళ్లుచేయడం మొదలుపెట్టాడు.