హైదరాబాద్: రా ఏజంట్ గా నమ్మించి విడాకులు తీసుకొన్న మహిళను పెళ్లి చేసుకొని బంగారు నగలను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సినిమాను తలపించేలా ఈ ఘటన ఉంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొంది.ఏడాదిన్నర క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో  ఆనందవర్ధన్ కు పరిచయం ఏర్పడింది.

నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఎం. ఆనందవర్ధన్ కు  పెళ్లై కొడుకు కూడ ఉన్నాడు. అయితే నెక్నాపూర్ కు చెందిన మహిళ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. భర్తతో విడాకులు తీసుకొన్న మహిళతో ఆనందవర్ధన్ కు పరిచయం ఏర్పడింది. తాను కూడా భార్యతో విడాకులు తీసుకొన్నానని ఆనందవర్ధన్ నమ్మించాడు.

తాను ఆర్మీ అధికారినని.. ప్రస్తుతం రా ఏజంట్ గా పనిచేస్తున్నానని  ఆమెను నమ్మించాడు. బెంగుళూరులోని ఓ ఇంటి అడ్రస్ తో గుర్తింపు కార్డును సృష్టించి ఆమెకు చూపించాడు.

విడాకులు తీసుకొన్నట్టుగా నకిలీ కాపీనీ చూపించి ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. అనంతరం మహిళ వద్ద ఉన్న 50 తులాల బంగారాన్ని దొంగిలించి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రూ. 8 లక్షలు తీసుకొన్నాడు.నెలలో 20 రోజుల పాటు ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నానని చెప్పి మొదటి భార్య వద్దకు వెళ్లేవాడు. 

బీరువాలో ఉన్న నగల గురించి ఆనంద వర్ధన్ ను రెండో భార్య ప్రశ్నించింది. అయితే ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రా ఏజంట్ ఇంట్లో దొంగతనం జరిగిందని తేలితే  పరువుపోతోందని రెండో భార్యను నమ్మించాడు. బెంగుళూరులో కేసు నమోదు చేయిస్తానని ఆమెను నమ్మించాడు. నకిలీపత్రాలతో కేసు నమోదు చేయించినట్టుగా ఆమెను నమ్మించాడు. 

బంగారం రికవరీ విషయాన్ని ప్రశ్నించడంతో సెప్టెంబర్ లో దొంగ పట్టుబడినట్టుగా  చెప్పాడు. అతని నుండి రూ. 14 లక్షలు  స్వాధీనం చేసుకొన్నట్టుగా చెప్పాడు. ఈ డబ్బులను ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేసినట్టుగా నకిలీ చెక్కులను సృష్టించాడు.

ఈ డబ్బుల విషయమై వీరిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. బెంగుళూరుకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే గత నెలలో రా అధికారుల పేరుతో నెక్నాపూర్ మహిళకు మేసేజ్ పంపాడు. ఆనంద్ వర్ధన్ ను కిడ్నాప్ చేసి దుండగులు చంపేశారని ఆ మెయిల్ లో పేర్కొన్నారు. డెడ్ బాడీని కూడ చూపలేమని  ఆ మెయిల్ లో చెప్పడంతో డెడ్ బాడీని తనకు చూపాలని ఆమె మెయిల్ కు రిప్లై ఇచ్చింది.

ఆనంద్ వర్దన్ విషయంలో అనుమానం వచ్చిన నెక్నాపూర్ మహిళ ఆయన గురించి సమాచారాన్ని తెలుసుకొంది.  విడాకులు తీసుకోలేదని ఆమెకు తెలిసింది. ఈ విషయం తెలిసిన రెండు రోజులకు ఆనంద వర్ధన్ ఆమె వద్దకు వచ్చాడు. అప్పటికే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాను కిడ్నాపర్ల నుండి తప్పించుకొని వచ్చినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయాన్ని ఒప్పుకొన్నాడు.