బాబా ముసుగులో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి.. దాదాపు రెండేళ్ల పాటు తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు. మంత్రాలు, మాయల పేరు చెప్పి.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డాడు. అతను చేసిన నేరాలు బయటకు రావడంతో.. పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. కాగా.. రెండేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పోలీసులు ముర్షద్‌ నగర్‌లో అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని రెయిన్ బజార్‌లో నివాసముండే అర్షద్ మంత్రాలతో అనారోగ్యాలు నయం చేస్తానంటూ ప్రచారం చేసుకునేవాడు. దీంతో అనేక మంది అతడిని సంప్రదించేవారు. ఈ క్రమంలోనే 2018లో ఓ మహిళ అతడి వద్దకు వెళ్లగా పూజల పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తనకు శారీరక సుఖాన్ని అందిస్తే అన్ని రోగాలు, దోషాలు నయం అవుతాయని నమ్మించి ఆమెపై అనేకసార్ల అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిరోజులకు అర్షద్ నిజస్వరూపం తెలుసుకున్న బాధితురాలు రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడి కార్యకలాపాలపై ఆరా తీయగా మరికొంతమంది మహిళలపైనా అలాగే అత్యాచారాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడంతో పరారయ్యాడు. కాగా... అతని కోసం అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. కాగా.. తాజాగా ఎట్టకేలకు ఆ దొంగబాబా పోలీసులకు దొరికిపోయాడు. అతనిని అరెస్టు చేశామని.. ఈ మేరకు కేసు  తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.