Asianet News TeluguAsianet News Telugu

మిస్డ్ కాల్ తో అక్రమ సంబంధం: ప్రియుడితో చేతిలో మహిళ హత్య

పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి తేవడంతో ఆమెను వదిలించుకోవడానికి ప్రియుడు పథక రచన చేశాడు. పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు.

Extra marital relation with Missed call lead to murder
Author
Miryalaguda, First Published May 4, 2019, 4:24 PM IST

మిర్యాలగూడ: ఓ మిస్ట్ కాల్ కారణంగా ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకరికి ఫోన్ చేయాలనుకుంటే అది వేరే వ్యక్తికి వెళ్లింది. దాంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అది చివరకు ఆమె ప్రాణాల మీదికి కూడా తెచ్చింది. 

పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి తేవడంతో ఆమెను వదిలించుకోవడానికి ప్రియుడు పథక రచన చేశాడు. పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు. నల్లగొండ జిల్లా మాడ్గుల పల్లి మండల కేంద్రంలోని కంకరమిల్లు సమీపంలో ఎముకలగూడు మాత్రమే ఉన్న మృతదేహం ఉందని ఏప్రిల్‌ 6వ తేదీన పోలీసులకు సమాచారం అందింది. దాన్ని మహిళ మృతదేహంగా గుర్తించిన మాడ్గులపల్లి పోలీసులు గుర్తు తెలియని మహిళ హత్యగా కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు..

చివరకు ఆ గుర్తు తెలియని మృత దేహం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.  కేసుకు సంబంధించి శుక్ర వారం మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడ మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన రేవూరి నాగరాణి భర్త ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో ఆమె తన ఇద్దరి పిల్లలను హాస్టల్‌లో చేర్పించి కొండ్రపోలు గ్రామంలో నార్కట్‌పల్లి - అద్దంకి హైవే వెంట ఉన్న ఓ దాబాలో పనిచేస్తూ జీవిస్తోంది. 

కొన్ని నెలల క్రితం తాండూరు కోటబాసు పల్లికి చెందిన గుర్రంపల్లి రాజుకు సెల్‌ నెంబర్‌కు పొరపాటున మిస్డ్‌కాల్‌ ఇచ్చింది. తన ఫోన్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ లేని రాజు జహీరాబాద్‌కు చెందిన తన మిత్రుడు మంగలి తులసి ఫోన్‌తో తిరిగి నాగరాణికి ఫోన్‌ చేశాడు. పొరపాటుగా తానే ఫోన్‌ చేశానని నాగరాణి చెప్పడంతో రాజు ఫోన్‌ పెట్టేశాడు. 

తర్వాత నుంచి మంగలి తులసి నాగరాణికి తరచూ ఫోన్‌ చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ఇరువురి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. తులసి తన ఆర్థిక అవసరాల నిమిత్తం నాగరాణి వద్ద బంగారు గొలుసు తాకట్టు పెట్టి రూ. 30వేల నగదు తీసుకెళ్లాడు. ఈ నగదు తిరిగి చెల్లించాలని, తనను పెళ్లి చేసుకోవాలని నాగరాణి తులసిపై ఒత్తిడి తీసుకుని వచ్చింది.
 
ఆమెను వదిలించకోవాలని భావించిన మంగలి తులసి మార్చి 26న జహీరబాద్‌ నుంచి కిష్టాపురం గ్రామానికి వచ్చి రాత్రి ఆమెతో గడిపాడు. సరదాగా తిరిగొద్దామంటూ మార్చి 27న నాగరాణిని జన సంచారం లేని కంకరమిల్లు వెనక్కు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. నెలరోజులుగా ఆమె మృతదేహం అక్కడే ఉండడంతో కుళ్లిపోయి ఎముకలు తేలాయి. అది గుర్తించి పోలీసులు గుర్తు తెలియన శవం కింద కేసు నమోదు చేసుకున్నారు.

ఆమె సెల్‌ఫోన్‌ నెంబరు డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్‌, హత్యకు ఉపయోగించిన మంగలికత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios