హైదరాబాద్: తన ప్రేయసితో అక్రమ సంబధం పెట్టుకున్నాడనే కోపంతో రియల్టర్ కనకరాజు ఆటో డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తోంది. తన ప్రేయసితో పారిపోయిన శ్రీకాంత్ రెడ్డి పట్టుకుని వచ్చిన 45 రోజుల పాటు నిర్బంధించి. చిత్రహింసలు పెట్టి చివరకు చంపేసి స్మశానవాటికలో పూడ్చి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

మహిళ సోదరుడు చంద్రశేఖర్, కనకరాజు కలిసి అతన్ని చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిద్దరితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ రెడ్డిని కిడ్నాప్ చేసి హైదరాబాదులోని జవహర్ నగర్ లోని ఓ ఇంట్లో బంధించారు. హత్య డిసెంబర్ 6వ తేదీన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

శ్రీకాంత్ రెడ్డి హత్యతో తనకు సంబంధం ఉన్నట్లు నిందితుడు కనకరాజు తన స్నేహితులతో చెప్పడంతో విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. హస్మత్ పేటలో నివసించే కనకరాజు (45) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా చెలామణి అవుతున్నాడు. 15 ఏళ్ల క్రితం ఓ మహిళ కుటుంబంలో చెలరేగిన గొడవలతో ఆమెకు భర్త నుంచి విడాకులు వచ్చే విధంగా కనకరాజు చూశాడు. 

ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ వ్యవహారం కొనసాగుతోంది. ఆల్వాల్ లోని మచ్చబొల్లారంలో నివాసం ఉంటోంది. కుత్బుల్లాపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డి ఆమె నివాసం ఎదురింట్లో ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి పాల్వంచ వెళ్లిపోయారు. వారిద్దరిని కనకరాజు కనిపెట్టి నచ్చజెప్పి పంపించాడు. వారు వినకపోవడంతో పాల్వంచ నుంచి తీసుకుని వచ్చి 45 రోజుల క్రితం శ్రీకాంత్ రెడ్డిని జవహర్ నగర్ లోని ఓ ఇంట్లో బంధించాడు. కనకరాజుతో పాటు మరో ముగ్గురు అతన్ని చిత్రహింసలు పెట్టారు. చివరకు ఈ నెల 6వ తేీదన తాడుతో గొంతు బిగించి చంపేశారు. 

శవాన్ని హస్మత్ పేటలోని స్మశానవాటికకు తీసుకుని వెళ్లి గుర్తు తెలియని శవంగా చెప్పి రాజేశ్ అనే వ్యక్తితో కలిసి పూడ్చిపెట్టారు.  మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరకు కనకరాజును అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో కనరాజును, మహిళ సోదరుడు చంద్రశేఖర్ ను, భాస్కర్, రాజశేఖర్, ప్రసాధ్, రమణ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 

శ్రీకాంత్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రస్తుతం మచిలీపట్నంలో ఉంటోంది. హత్యతో ఆమెకు సంబంధం ఉందా, లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.