హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్య కేసులో పురోగతి లభించింది. జ్యోతి భర్త శ్రీనివాస రావు ఈ హత్యలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్య కేసులో పురోగతి లభించింది. జ్యోతి భర్త శ్రీనివాస రావు ఈ హత్యలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. జ్యోతికి గత కొంతకాలంగా యశ్వంత్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రావు జ్యోతితో పాటు, యశ్వంత్‌లను హత్య చేశాడు. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు ఈ నేరంలో పాలుపంచుకున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెంలో నగ్న స్థితిలో జంట మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వారిని హత్య చేసి అక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన స్కూటర్, హ్యాండ్‌బ్యాగ్ ఆధారంగా పోలీసులు వారిని క్యాబ్ డ్రైవర్ యశ్వంత్, జ్యోతిగా గుర్తించారు. బాధితులు సికింద్రాబాద్‌కు చెందిన వారని పోలీసుల విచారణలో తేలింది. హత్యకు సంబంధించి వారి కుటుంబాలకు సమాచారం అందించారు. మహిళకు వివాహం అయిందని..ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. యశ్వంత్‌తో ఆమెకున్న వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని అనుమానించిన పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టమ్‌కు తరలించారు.
ఘటన స్థలంలో గుర్తించిన స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దాని యజమానిని గుర్తించారు. అది యశ్వంత్ సోదరుడి పేరు మీద ఉన్నట్టుగా తేల్చారు. అయితే యశ్వంత్ ఆదివారం సాయంత్రం తన వాహనం తీసుకుని ఇంటికి తిరిగి రాకపోవడంతో అనిరుధ్ పోలీసులకు సమాచారం అందించాడు. ‘‘సాధారణంగా యశ్వంత్ బయటకు వెళ్లి రెండు రోజుల తర్వాత తిరిగి వస్తాడు. ఈద్ వేడుకలు ఉన్నందున అతను స్నేహితుడి ఇంటికి వెళ్లి ఉంటాడని మేము అనుకున్నాము. యశ్వంత్‌కు వివాహేతర సంబంధం ఉందన్న విషయం మాకు తెలియదు. అయితే అతడు మొబైల్‌లో గంటల తరబడి ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించాను’’ అని యశ్వంత్ తెలిపాడు.
ఇక, ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక బలగాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. జ్యోతి భర్తే ఈ హత్య చేసినట్టుగా తేల్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ రావు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
