మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి మహిళలపై కిరోసిన్ పోసి నిప్పింటించాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత జంగం మంగమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

కొన్నాళ్లు బాగానే నడిచిన వీరి అక్రమ సంబంధంలో ఈ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మంగమ్మపై కక్షను పెంచుకున్న రాములు ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.

మంగళవారం సాయంత్రం కూలీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మంగమ్మను వెంబడించాడు. ముందుగానే తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు.

మంటల ధాటికి మంగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం మరింత మెరుగైన చికిత్స నిమిత్తం మంగమ్మను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మంగమ్మను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన రాములు పలు హత్య కేసుల్లో నిందితుడు. సొంత కుటుంబసభ్యులనే అతను అంతం చేశాడని పోలీసులు తెలిపారు.