హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల వ్యయం రూ. 300 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపించనున్నారు. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ సిఈవోకు లేఖ రాసింది. ఎల్లుండి నుంచి రాష్ట్రానికి ఈవిఎంలు వస్తాయని, 2014లో వాడిన ఈవిఎంలు పనికి రావని సిఈవో రజత్ కుమార్ చెప్పారు. బెల్ నుంచి ఈవిఎంలు, వీవి ప్యాట్ లు వస్తున్నట్లు తెలిపారు. 

రెండు రోజుల్లో ఈసి ప్రతినిధుల బృందం హైదరాబాదు వస్తుందని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతుందని ఆయన చెప్పారు.  నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణతో పాటు తెలంగాణ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కూడా ప్రతినిధి బృందం పరిశీలన జరుపుతుంది.

తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. ఈ నెల 11వ తేదీన ఈసి ప్రతినిధి బృందం హైదరాబాద్ రానుంది.

సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో ఆ ప్రతినిధి బృందం రాష్ట్రానికి వస్తుంది. ఎన్నికల ఏర్పాట్లపై, ఎన్నికల సాద్యాసాధ్యాలపై ఈసి ప్రతినిధి బృందం పరిశీలన జరుపుతుంది. 

రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రతినిధి బృందం ఓ నివేదిక సమర్పించనుంది. ఈ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.