నల్లగొండ: నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధిస్తారని ఎగ్టిట్ పోల్స్ తేల్చాయి. నోముల భగత్ 20వేలకు పైగా మెజారిటీ విజయం సాధిస్తారని ఆరా అనే సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం చేసింది. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి షాక్ తప్పదని తేల్చింది.

టీఆర్ఎస్ కు 95,801 (50.48 శాతం) ఓట్లు వస్తాయని, కాంగ్రెసుకు 75,779 (39.93 శాతం) ఓట్లు వస్తాయని, ఇతరులు 6,224 (3.28 శాతం) ఓట్లు వస్తాయని చెప్పింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బిజెపి నాగార్జునసాగర్ లో నామమాత్రం ఓట్లు మాత్రమే సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 

నోముల భగత్  21,486 ఓట్ల మెజారిటీ సాధిస్తారని మిషన్ చాణక్య కూడా తేల్చి చెప్పింది. ఆయనకు 93,450 ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య చెప్పింది. కాంగ్రెసు అభ్యర్థి జానారెడ్డికి 71,964 ఓట్లు వస్తాయని చెప్పింది. 

హెచ్ఎంఆర్ సంస్థ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధిస్తారని చెప్పింది. అయితే ఆయనకు కేవలం 6,263 ఓట్ల మెజారిటీ మాత్రమే వస్తుందని తేల్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు 78,095 (41.15 శాతం) ఓట్లు, కాంగ్రెసు అభ్యర్థి జానారెడ్డికి 71,832 (37.85 శాతం), బిజెపి అభ్యర్థి రవి నాయక్ కు 17,573 (9.26 శాతం) ఓట్లు వస్తాయని ఆ సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. 

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం మే 2వ తేదీన వెలువడనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ కు ఉప ఎన్నిక జరిగింది.