మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై స్పందించారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ , మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు జోష్ వుందని.. రాష్ట్రంలో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ , మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావడం మంచిదేనని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం అంతా కృషి చేయాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. బీజేపీని వ్యతిరేకించే విపక్షాలన్నీ ఏకతాటిపైకిరావడాన్ని ఆమె స్వాగతించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు జోష్ వుందని.. రాష్ట్రంలో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు. నిన్నటి వరకు మాకు బేడీలు వేసే పోలీసులు కూడా మాకు సలాం కొడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ALso Read: సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లోకి రావడం లేదు.. భట్టిని పరామర్శించిన అనంతరం పొంగులేటి..
కాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో కలిసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. తాజాగా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లు భట్టి విక్రమర్కను నల్గొండ జిల్లాలో కలిశారు. కేతేపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలోని వీరిద్దరు భేటీ అయ్యారు. మండుటెండలో పాదయాత్ర కొనసాగించిన భట్టి విక్రమార్క వడదెబ్బతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క్‌ను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిక సంబంధించి మల్లుభట్టి విక్రమార్కతో పొంగులేటి చర్చించారు
