ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ఏకైక నాయకుడు పాములపర్తి వెంకట నరసింహారావు. దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలకు ఆయన నాంది పలికాడు. మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి తన రాజకీయ చతురతను ప్రదర్శించిన వ్యక్తి పివి. ఇలా తెలుగు ప్రజలనే కాదు దేశ ప్రజల మన్ననలు పొందిన ప్రధానిగా పివి చరిత్రలో నిలిచిపోయారు. 

అయితే తాజాగా పివి చిన్ననాటి జ్ఞాపకాలను నిలయంగా నిలిచిన ఇంటిని కుటుంబసభ్యులు కూల్చివేశారు.  వరంగల్ అర్బన్ జిలా జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పివి నర్సింహిరావుకు వారసత్వంగా ఓ ఇళ్లు సంక్రమించింది. అయితే ఆయన ప్రధానిగా వున్న సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఇంటికి మార్పులు చేశారు. సీఆర్పీఎఫ్‌ బలగాల కోసం ఇంటిని విస్తరించి నూతనంగా మరికొన్ని నిర్మాణాలు చేపట్టారు. 

అయితే ఆ ఇంటిని కూల్చివేసి నూతనంగా నిర్మాణం చేపట్టాలని పివి వారసులు భావించారు. అందుకోసం ఆ ఇంటిని పాక్షికంగా కూల్చివేశారు. కొత్తగా నిర్మించే ఇంట్లో పీవీ జ్ఞాపకాలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.