హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ బిజెపిలో చేరడం ఖాయమైంది. కాంగ్రెసు పార్టీలో కొనసాగుతారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, కాంగ్రెసుకు షాక్ ఇస్తూ ఆయన బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వివేక్ తమ పార్టీలో చేరుతున్నట్లు బిజెపి నేతలు స్పష్టం చేశారు. 

మాజీ ఎంపీ వివేక్ యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.  టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేరకుండా సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలే బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. బీజేపీ జాతీయాధక్షుడు అమిత్ షాను కలిశారు. త్వరలో పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు. 

అయితే, వివేక్ టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ ఇంటికి వెళ్లి మరీ దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఉత్తమ్ వివేక్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెసులో చేరుతారని ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి తెర దింపుతూ ఆయన బిజెపిలో చేరడానికి నిర్ణయించుకున్నారు. జాతీయ నేతల సమక్షంలో ఆయన బిజెపిలో చేరనున్నారు.