రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి రామచందర్ కారణంగా నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని .. అతని కుటుంబానికి న్యాయం చేయాని కోరుకుంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పిస్తానని చెప్పి కేశవపట్నం మండలం అంబాలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డబ్బులు తీసుకుని మోసం చేశారని , దీంతో బాధితుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ మేరకు బాధితుడికి సంఘీభావంగా మంచిర్యాల చౌరస్తా సివిల్ హాస్పిటల్ వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి పొన్నం ప్రభాకర్ ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... పొన్నం ప్రభాకర్ తదితర నాయకులు అక్కడే నిరాహారదీక్షకు దిగారు.