జూలై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ నేతలు కూడా తనను, జూపల్లిని కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
జూలై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సోమవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభను మించి సభను నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయనుకున్నామని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. ఆత్మాభిమానం కూడా ముఖ్యమేనని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదన్నారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు కొన్ని సర్వేలు చేయించామని.. ఈ సర్వేల్లో కేసీఆర్‌కు 80 శాతం మంది జనం వ్యతిరేకంగా వున్నారని తేలిందని పొంగులేటి తెలిపారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో .. ప్రజలు ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారో ఆలోచించామని ఆయన తెలిపారు. ఒక దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా వచ్చిందని.. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచనను విరమించుకున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు.
తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా దక్కలేదని.. సోనియా ఇచ్చిన తెలంగాణ ఫలాలు ఎవరికీ దక్కలేదని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోరుకున్నారని ఆయన వెల్లడించారు. జూపల్లితో కలిసి తాను అనేక సభలు , సమావేశాలు నిర్వహించానని పొంగులేటి పేర్కొన్నారు. ఎన్నో సర్వేలు , ప్రముఖులతో మాట్లాడిన తర్వాత రిజల్ట్‌ను సింగిల్ పేపర్‌పై పెట్టామన్నారు.
రెండు జాతీయ పార్టీల నాయకులు, కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు తమతో చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు.
బీజేపీ నేతలు కూడా తనను, జూపల్లిని కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసిందని పొంగులేటి చెప్పారు. ఎన్నికలకు మందు కేసీఆర్ మాయమాటలు చెబుతారని, కాంగ్రెస్ అలా చెప్పలేకపోయిందని లేదంటే 2014లోనే కాంగ్రెస్ గెలిచేదని పొంగులేటి తెలిపారు. నేతలు మాతో టచ్‌లో వున్నా.. రాహుల్, ఖర్గేను కలిశాక నిర్ణయం తీసుకుందామని జూపల్లికి చెప్పానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కు నష్టం కలుగుతుందని సోనియాకు నేతలు చెప్పారని, అయినప్పటికీ ఆమె సాహసం చేశారని పొంగులేటి ప్రశంసించారు. 60 ఏళ్ల పోరాటానికి సోనియా ముగింపు పలికారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తనకు బిజినెస్‌లు కావాలనుకుంటే కాంగ్రెస్‌లో చేరననని ఆయన తేల్చిచెప్పారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో జరిగే సభకు రావాల్సిందిగా ప్రియాంక గాంధీని కోరామని, ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. జూలై 14 లేదా 16 లలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కృష్ణారావు వెల్లడించారు. ఉద్యమ సమయంలో పదవులను సైతం వదిలిపెట్టి పోరాడామని, కానీ తెలంగాణ వచ్చాక మా అంచనాలన్నీ తప్పాయన్నారు. కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తూ.. కేసీఆర్ జిమ్మిక్కులను ప్రదర్శిస్తున్నారని జూపల్లి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు నియంతృత్వ ధోరణి పరాకాష్టకు చేరిందని.. ఆయనకు మూడోసారి సీఎం పాలించే అర్హత లేదన్నారు. మంత్రులను సైతం కేసీఆర్ మనుషులుగా చూడరని జూపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
