కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న తెలంగాణ వాసులకు మరోసారి చేయూతనిచ్చారు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

గల్ఫ్ దేశాల నుండి విజయవాడ చేరుకున్న నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 35 మంది, మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మంగళవారం స్వస్థలాలకు చేరుకున్నారు.

వీరంతా ఉపాధి నిమిత్తం అబుదాబి వెళ్లారు. అయితే కరోనా కారణంగా వారంతా స్వదేశీ బాట పట్టారు.  అందుబాటులో ఉన్న విమానాల ద్వారా ఈ నెల 11న విజయవాడ చేరుకున్నారు.

నిబంధనల ప్రకారం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా, విజయవాడ నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా  కవితను కోరారు.

దీనిపై స్పందించిన ఆమె ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ చేరుకున్న వీరిని తెలంగాణ జాగృతి నిజామాబాద్ అధ్యక్షులు అవంతి మరియు జాగృతి నాయకులు స్వాగతించి, అల్పాహారం అందించారు. అడిగిన వెంటనే స్పందించి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసిన  కవితకి వీరు కృతజ్ఞతలు తెలిపారు.