టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య సభలో అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి స్థానిక నాయకుడు కావాలన్న ప్రజల కోరిక మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న రాజయ్య ఒక్కసారిగా ఉద్వేగానికిలోనై కంట నీరు పెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 40 ఏళ్లుగా నియోజకవర్గాన్ని స్థానికేతరులే ఏలుతున్నారని ఆనాడు ప్రజలు తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. స్థానికుడు కావాలన్న ప్రజల కోరికను కాదనలేక పవిత్రమైన వైద్య వృత్తిని వదిలి కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.  2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమిస్తూ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు 

పదవి పోయిందన్న బాధ కన్నా అదే పదవి మన నియోజకవర్గానికే దక్కిందన్న ఆనందంతో ఆనాడు ఉన్నట్లు ఆయన తెలిపారు. సొంత పార్టీకి చెందిన వారే తనను అప్రతిష్ట పాలు చేయడం, అభివృద్ధిలో నియోజకవర్గం నాలుగో స్థానంలో ఉన్నా అభివృద్ధి జరగలేదని ప్రచారం చేయడం బాధకు గురి చేసిందన్నారు. తన ద్వారా పదవులు, కాంట్రాక్టరు పనులు, సబ్సిడీ ట్రాకర్లు పొందిన వారే ఈ రోజు దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణలో ఎవరూ అభివృద్ధి చేసినా, అది సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నిధులతోనే తప్ప మరొకటి కాదన్నారు.