Chittaranjan Das: బీఆర్ఎస్ కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
Chittaranjan Das: అధికార బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించినట్లు వెల్లడించారు.
Chittaranjan Das: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార బి.ఆర్.ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. అసమ్మతినేతలను బుజ్జగించే ప్రయత్నంలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సీఎం కేసీఆర్ ను గద్దెదించి అధికార పగ్గాలను చేపట్టాలని ప్రణాళికలను రూపొందిస్తోంది. అటు బిజెపి సైతం అసమ్మతి నేతలను తన పార్టీలో చేరుకుంటూ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో అధికార బిఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించినట్లు వెల్లడించారు. శుక్రవారం నాడు తన నివాసంలో అనుచరులతో భేటీ అయిన ఆయన బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు తెలిపారు.
కిషన్ రెడ్డితో భేటీ..
టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చితరంజన్ దాస్ బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీ సమయంలో ఆయనను కిషన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారంట.
ఇదిలా ఉంటే చిత్తరంజన్ దాస్ కు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ను ఓడించిన ఘనత ఆయన సొంతం. 1989 అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నుండి పోటీ చేసిన ఎన్టీఆర్ ను చిత్తరంజన్ దాస్ (కాంగ్రెస్) ఓడించి, సెన్సేషన్ క్రియేట్ చేశారు. అనంతరం.. 2018లో కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. కానీ, ఆయనకు పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.