టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనని మెడపెట్టి బయటకు గెంటేశారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్ ని కేసీఆర్ వేరేవ్యక్తికి కేటాయించారు.

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన శోభ.. పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దళితబిడ్డనైన తనను కేసీఆర్ మెడ పట్టి గెంటివేశారని వ్యాఖ్యానించారు. తన తడాఖా ఎంటో ఎన్నికల్లో చూపిస్తానని సవాల్ విసిరారు. 

కేసీఆర్‌ కుటుంబపాలనపై యుద్దం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని..అగ్రవర్ణాలకే పెద్దపీట అని విమర్శించారు. ఈ రోజు బీజేపీలో చేరుతున్నానని..అన్ని వివరాలు తర్వాత చెబుతానని బొడిగె శోభ పేర్కొన్నారు.