నా జీవితంలో చూడలేదు : ఏపీ, తెలంగాణ రాజకీయాలపై తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
రెండు రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతోందని, ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలన తన జీవితంలో చూడలేదన్నారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు . విపక్షాలను , ప్రజలను బెదిరించి అన్నివేళలా రాజకీయాలు చేయలేరని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతోందని, ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలన తన జీవితంలో చూడలేదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్ధితులు లేవని, అలాగే ఎన్నడూ ప్రతీకారాలను చూడలేదన్నారు. విపక్షాలను , ప్రజలను బెదిరించి అన్నివేళలా రాజకీయాలు చేయలేరని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణలో సుస్ధిరమైన పాలన కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
కాగా.. పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తుమ్మలను పక్కకు పెట్టారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ దశలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల విజ్ఞప్తి.. కార్యకర్తల కోరిక మేరకు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాపై మంచి పట్టుకున్న ఆయన.. ఈసారి కాంగ్రెస్‌కు ఉమ్మడి జిల్లాలోని మొత్తం స్థానాలు కాంగ్రెస్ గెలిచేలా చక్రం తిప్పుతున్నారు.
నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అలాగే తన పరిచయాల ద్వారా కీలక నేతలను కాంగ్రెస్ గూటికి తీసుకొస్తున్నారు. తుమ్మల, పొంగులేటి వంటి బలమైన నేతలను ఎదుర్కొని ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ విజయం సాధించడం అంత తేలిక కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్‌ను కూడా అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. చివరి నిమిషంలో తిమ్మిని బమ్మిని చేయగల సత్తా ఆయన సొంతం.