తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలంటూ ఆత్మీయ సమ్మేళనంలో అనుచరులకు పిలుపునిచ్చారు తుమ్మల.
తాను పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తాను టీఆర్ఎస్‌లో కేసీఆర్ వెంటే వుంటానని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కేసీఆర్ వేల కోట్లు ఇచ్చారని తుమ్మల అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలంటూ ఆత్మీయ సమ్మేళనంలో అనుచరులకు పిలుపునిచ్చారు తుమ్మల. అనుచరులు తన వెంట వుంటే కొండలను కూడా పిండి చేస్తానని నాగేశ్వరరావు అన్నారు. రాజకీయాలలో ఒడిదుడుకులు సహజమని.. భవిష్యత్ మనదే, ఎవరూ అధైర్య పడొద్దని తుమ్మల భరోసా ఇచ్చారు.
ఆత్మీయ సమ్మేళనం యాదృశ్చికమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. 40 ఏళ్లుగా నీతి, నిజాయితీతో రాజకీయాలు చేశానని.. భవిష్యత్తులోనూ అలానే వుంటానని తుమ్మల స్పష్టం చేశారు.
ఇకపోతే... తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడులో గురువారంనాడు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వాజేడులో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. సుమారు 300 కార్లతో తుమ్మల నాగేశ్వరరావు ఆయన అనుచరులు వాజేడుకు వెళ్లారు. మంత్రిగా ఉన్న సమయంలో వాజేడులో పలు అభివృద్ది కార్యక్రమాలను తుమ్మల నాగేశ్వరరావు చేపట్టారు. ఈ కార్యక్రమాల సింహావలోకనం పేరుతో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
ALso Read:పార్టీకి కొందరు ద్రోహం చేశారు ... వాళ్ల సంగతి మీరే చూడాలి : కార్యకర్తలతో భేటీలో తుమ్మల వ్యాఖ్యలు
తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్న సమయంలో ప్రస్తుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఈ రెండు వర్గాలు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నించాయి. 2014 తర్వాత తుమ్మలనాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నామా నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అప్పటికే ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాకుండా నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఈ స్థానం నుండి గెలుపొందారు. కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డికి ,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య పొసగడం లేదు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీకి తుమ్మల నాగేశ్వరరావు సన్నాహలు చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తారా అనే చర్చ కూడా లేకపోలేదు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు అదే స్థానం నుండి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ టికెట్లు కేటాయించింది.
